Andhra Pradesh: చంద్రబాబు రూ.3 వేలు ఇస్తే కాదనొద్దు.. రూ.5,000 కావాలని డిమాండ్ చేయండి!: జగన్ సూచన
- పోలీస్ శాఖను చంద్రబాబు భ్రష్టు పట్టించారు
- ఊర్లలోకి ఇంటెలిజెన్స్ అధికారులను పంపుతున్నారు
- ‘సీ విజిల్’ యాప్ ను వినియోగించుకోండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.3 వేలు చేతిలో పెడితే వద్దని చెప్పొద్దని వైసీపీ అధినేత జగన్ సూచించారు. రూ.3,000 కాదు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలని సలహా ఇచ్చారు. డబ్బులు తీసుకునే సందర్భంగా ‘ఈ రాక్షసుడికి ఓటేయకూడదు’ అని మనసులో అనుకోవాలన్నారు. ఏ దేవుడు అయినా అవినీతి సొమ్ము తీసుకుని ఓట్లేయమని చెప్పడన్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ఈరోజు నిర్వహించిన ‘సమరశంఖారావం’ సభలో జగన్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పోలీస్ శాఖను కూడా చంద్రబాబు భ్రష్టు పట్టించారని జగన్ విమర్శించారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ అధికారులను గ్రామాల్లోకి పంపుతున్నారని వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా కనీసం 50 మంది ఓటర్లను ప్రభావితం చేయగల ప్రముఖులు ఎవరు ఉన్నారో వెతుకుతున్నారని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తుల జాబితాను అధికారులు చంద్రబాబుకు చేరవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇంటెలిజెన్స్ అధికారులు వైసీపీ కార్యకర్తలను కొనుగోలు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. టీడీపీ అక్రమాలపై పోరాడేందుకు ఎన్నికల సంఘం తెచ్చిన ‘సీ విజిల్’ అనే యాప్ ను స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేస్తే కేవలం 100 నిమిషాల్లోనే రిటర్నింగ్ అధికారి వాటిపై స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.