Narendra Modi: మోదీ సభలో నిరసన...చంద్రబాబు దీక్షకు మద్దతు: హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని

  • కేంద్రం ఏపీని పూర్తిగా విస్మరించిందని ఆరోపణ
  • ఖాళీ బిందెలతో ప్రధానికి స్వాగతం పలకాలని పిలుపు
  • విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించాలని డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో పూర్తిగా పక్కన పెట్టేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తామని, అదే సమయంలో విభజన హామీ కోసం ఢిల్లీలో దీక్ష చేయనున్న సీఎం చంద్రబాబుకు మద్దతు తెలుపుతామని ప్రత్యేక హోదా, విభజన హామీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు.

విశాఖలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రం విభజన హామీలన్నీ అమలు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని, ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు సభకు రానున్న ప్రధానికి ఖాళీ బిందెలతో స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఏపీ తమకు రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగపడదన్న ఉద్దేశంతోనే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఆధ్యాత్మిక సన్నిధానానికి భక్తులను తీసుకువెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఎంత ఆలస్యంగా నడుస్తోందో చూస్తే రైల్వేలో నిర్వహణలోపం ఎలా ఉందో అర్థమవుతోందని, ఇప్పటికైనా ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీలో రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి ఏపీకి అనుకూలంగా ఉంటే, మోదీ, అమిత్‌షా, జైట్లీలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. భారతీయులను విభజించి పాలించాలని చూడడం దారుణమన్నారు.

More Telugu News