Chandrababu: జగన్.. మరీ ఇంత నీచానికి దిగజారాలా.. పద్ధతి కాదు!: చంద్రబాబు
- కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్ పన్నాగం
- వైసీపీ సైకో పార్టీలా తయారైంది
- మా మంత్రివర్గంలో నలుగురు రెడ్లు ఉన్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరీ ఇంత నీచానికి దిగజారొద్దని హితవు పలికారు. టీడీపీలోనూ, ప్రభుత్వంలోనూ అన్ని కులాలు ఉన్నాయని, కానీ ప్రతిపక్ష నేత జగన్ ఒకే కులానికి వంతపాడుతున్నారని విమర్శించారు. అది ఎంతమాత్రమూ మంచి పద్ధతి కాదన్నారు.
కులాలకు, అధికారులకు సంబంధం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ కులానికి అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం చేయడంలో తాను ముందుంటానన్న చంద్రబాబు.. తమ మంత్రివర్గంలో నలుగురు రెడ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో పండుగలా జరుగుతున్న పింఛన్ల పంపిణీ, పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీని అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.
జగన్‌లో శాడిజం పెరిగిపోయిందని, ఆయన పార్టీ సైకో పార్టీగా మారిందని మండిపడ్డారు. ప్రజలు ఎప్పుడూ కష్టాల్లో ఉండాలనేదే వైసీపీ లక్ష్యమని, అందుకోసమే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడడం జగన్ శాడిజానికి ప్రత్యక్ష నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.