murder case: మద్యం సీసా మూత ఆధారంతో వెలుగు చూసిన హత్యోదంతం

  • భర్తను హత్య చేసిన నిందితురాలిని పట్టించిన వైనం
  • వేధింపు తాళలేక బంధువుతో కలిసి దురాగతం
  • సీసీ టీవీ పుటేజీలో దొరికిన నిందితులు

మద్యం మత్తులో నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్త తీరుతో ఆమె విసిగిపోయింది. తనతోపాటు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న అతని తీరుతో మనస్తాపానికి గురైంది. అతనితో కలిసి కాపురం చేయడం కంటే వదిలించుకోవడమే ఉత్తమమని బంధువులతో కలిసి ప్లాన్‌ చేసింది. అయితే, ఘటనా స్థలిలో దొరికిన మద్యం సీసా మూత మొత్తం గుట్టును బట్టబయలు చేసింది.

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌ శివారు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి.శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధి అద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన బోని శ్రీనివాస్‌కు పద్నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం అయింది. కూలిపనులు చేసుకుని జీవనోపాధి పొందే శ్రీనివాస్‌ మద్యానికి బానిసై నిత్యం భార్యను, ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తుండే వాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన స్వప్న మేనమామ యాదగిరిని సంప్రదించింది. కొంత మొత్తం తీసుకుని ఇందుకు అంగీకరించిన యాదగిరి తన స్నేహితుడు రమేష్‌తో కలిసి హత్యకు ప్లాన్‌ వేశాడు.

అనంతరం మృతుడి భార్య స్వప్న, అత్తమామలు లక్ష్మి, మల్లేశంతో కలిసి గతనెల 29న హత్య చేశారు. తొలుత శ్రీనివాస్‌తో పూటుగా మద్యం తాగించారు. ధర్మవరం పరిధి రవలకోలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీనివాస్‌ను చంపేసి పెట్రోల్‌ పోసి తగల బెట్టారు. శ్రీనివాస్‌ కనిపించడం లేదని అతని తల్లి శామీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారణ ప్రారంభించిన పోలీసులకు ఘటనా స్థలిలో ఓ మద్యం సీసా మూత లభించింది. బార్‌కోడ్‌ ఆధారంగా దాన్ని పూడూరు ఎక్స్‌రోడ్డులోని మద్యం షాపులో కొన్నట్లు నిర్థారించుకున్నారు. అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా యాదగిరి, రమేష్‌, మృతుడు శ్రీనివాస్‌ బైక్‌ మీద వెళ్లడం రికార్డయి ఉంది. నిందితులను అరెస్టుచేసి తమ మార్గంలో విచారించగా నేరం అంగీకరించారు. దీంతో నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు.

More Telugu News