High Court: సివిల్‌ డ్రెస్‌లో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తే చెల్లదు: పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

  • యూనిఫాం, కోడ్‌ ఎందుకు ఇచ్చినట్లు
  • చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించం
  • కరీంనగర్‌ పోలీసులకు న్యాయమూర్తి అక్షింతలు

‘మీకో యూనిఫాం ఉంది...దానికో కోడ్‌ ఉంది...మీ నేమ్‌ ప్లేట్‌ ఉంటుంది...అవన్నీ వదిలేసి సాధారణ పౌరుల్లా సివిల్‌ డ్రెస్‌లో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవాలా, అది కూడా మా ఆదేశాలను బేఖాతరుచేసి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’... కరీంనగర్‌ పోలీసులకు తెలంగాణ హైకోర్టు చేసిన హెచ్చరిక ఇది.

రమ్మీ చట్టవిరుద్ధం కాదని హైకోర్టు చెప్పినా కరీంనగర్‌లోని తన రిసార్ట్స్‌పై పోలీసులు తరచూ దాడిచేయడాన్ని వ్యతిరేకిస్తూ పుష్పాంజలి కంట్రీ రిసార్ట్స్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు రిసార్ట్స్‌పై దాడి చేయొద్దని ఆదేశించింది. అయినా పోలీసులు దాడులు నిర్వహించడంతో యాజమాన్యం కోర్టు ధిక్కారం కేసు వేసింది.

ఈ కేసు విచారించిన న్యాయమూర్తి నేర శిక్షాస్మృతి కంటే పోలీసుల ఉత్తర్వులు గొప్పవి కావని గుర్తుంచుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా సివిల్‌ డ్రెస్‌లో ఓ రిసార్ట్స్‌కు వెళ్లి హల్‌చల్‌ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించరాదని, తమ ఆదేశాలను అతిక్రమించి వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేసింది.

More Telugu News