Hyderabad: క్లాస్ మేట్ కాపురంలో చిచ్చుపెట్టిన డాక్టర్!

  • కొత్త నంబర్ తో వాట్స్ యాప్ గ్రూప్
  • అందులో మార్ఫింగ్ ఫోటోలు
  • టెక్నాలజీ సాయంతో కేసును ఛేదించిన పోలీసులు

పెడదారి పట్టిన ఓ డాక్టర్ తనతో పాటు వైద్య విద్యను అభ్యసించి, ఆపై వివాహం చేసుకుని భర్తతో సుఖంగా ఉంటున్న గృహిణి కాపురంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన సోహెబ్ అలీ కొంతకాలం క్రితం చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ సమయంలో ఆయనతో పాటు చదువుకున్న ఓ యువతి, యువకుడు ఆ తరువాత ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది.

అప్పట్లో ఆమెపై కన్నేసి విఫలమైన సోహెబ్, పగ తీర్చుకోవాలని భావించి, కొత్త సెల్ ఫోన్ నంబర్ తీసుకుని, దానితో తన ఎంబీబీఎస్ క్లాస్ మేట్స్ తో ఓ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. అందులో తనను తాను చేర్చుకుని, బాధితురాలు, ఆమె భర్తను కూడా చేర్చాడు. గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలియకుండా చూసేందుకు జాగ్రత్త పడ్డాడు. ఆపై బాధితురాలి ఫోటోలను సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి, అదే గ్రూప్ లో పెట్టడంతో ఆమె భర్త నిలదీశాడు. తనకేమీ తెలియదని ఆమె వాపోయినా, గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయి.

గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసిన వారు విఫలమయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు, తాను వినియోగించిన సిమ్ కార్డును ధ్వంసం చేసి, ఆధారాలు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే, టెక్నాలజీ సాయంతో దర్యాఫ్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ పనంతా సోహెబ్ అలీ చేసిన నిర్వాకమేనని తేల్చి అరెస్ట్ చేశారు.

More Telugu News