Sreesanth: శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టి పొరపాటు చేశాను.. భజ్జీ పశ్చాత్తాపం
- 2008 ఐపీఎల్లో ఘటన
- మైదానంలోనే శ్రీశాంత్ చెంప వాయించిన భజ్జీ
- శ్రీశాంత్ ఎప్పటికీ తన సోదరుడేనన్న స్పిన్నర్
ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టడం తప్పేనని టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 2008 ఐపీఎల్లో జరిగిన ఈ ఘటనపై తాజాగా హర్భజన్ స్పందించాడు. 11 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమైంది. అప్పట్లో జరిగిన ఆ ఘటన ఇప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉందన్న హర్భజన్.. ఒకవేళ వెనక్కి వెళ్లే అవకాశమే ఉంటే నాటి తప్పును సరిదిద్దుకునే వాడినని భజ్జీ అన్నాడు.
శ్రీశాంత్ అద్భుత ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదన్న హర్భజన్.. తాను అలా ప్రవర్తించి ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీశాంత్‌కు, అతడి భార్యా పిల్లలకు తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నాడు. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోబోనని, శ్రీశాంత్ ఇప్పటికీ తన సోదరుడేనని హర్భజన్ స్పష్టం చేశాడు.
2008 ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్-ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. కింగ్స్ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్ ముంబై బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. శ్రీశాంత్ అతిగా సంబరాలు చేసుకోవడం నచ్చని హర్భజన్.. శ్రీశాంత్ చెంప పగలగొట్టాడు. అయితే, ఈ ఘటనను చూసిన వారు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ కానీ లేదు. శ్రీశాంత్ ఏడుస్తూ భజ్జీ తనను కొట్టాడంటూ ఆరోపించిన ఫొటోలు మాత్రం వైరల్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత కింగ్స్ ఎలెవన్ డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి హర్భజన్ క్షమాపణలు కూడా చెప్పాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. అలా చేసి ఉండాల్సింది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ వెనక్కి వెళ్లే అవకాశమే ఉంటే తప్పును సరిదిద్దుకుంటానని పేర్కొన్నాడు.