Telugudesam: 22 పార్టీల అధినేతలతో... అమరావతిలో కోల్ కతా సభకు దీటైన సభ: చంద్రబాబు

  • టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్
  • మోదీతో కలిసి కేసీఆర్, జగన్ ల కుట్ర
  • వైఎస్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని విమర్శ

కోల్ కతాలో జరిగిన విపక్షాల ఐక్యతా ర్యాలీని మించిన ర్యాలీ, బహిరంగ సభను అమరావతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నేతలు, ఇన్ చార్జ్ లు, ముఖ్య కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, కోల్ కతా సభ దేశ ప్రజలకు ఓ భరోసాను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే అమరావతిలో దానికి దీటైన సభను నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ ర్యాలీకి హాజరవుతారని చెప్పారు.

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి కేవలం రూ. 5,399 కోట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రానికి ఏం మేలు చేశారని వారానికి ఒక కేంద్ర మంత్రి రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన పెడతామని కేంద్రం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించిన చంద్రబాబు, 'రాజా ఆఫ్ కరప్షన్' పుస్తకంపై రెండవ సంతకం చేసింది కేసీఆరేనని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖరరెడ్డిని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారని అన్నారు.

అసెంబ్లీ వేదికగా, కేసీఆర్ మాట్లాడుతూ, వైఎస్ ను పొగిడారని, నరేంద్ర మోదీ డైరెక్షన్ వల్లే ఇప్పుడు జగన్ తో కలవాలని కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారని నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలూ కలిసి ఏపీని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయని, ప్రజలు వీరిని అడ్డుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News