Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరిని నేడు విచారించనున్న ఎన్ఐఏ!
- శ్రీనివాసరావును ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ అధికారులు
- లాయర్ సలీం సమక్షంలో ప్రశ్నల వర్షం
- 24 పేజీల లేఖను పోలీసులు తీసుకోవడంపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడికేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు ఐదో రోజు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రాంతీయ కార్యాలయంలో లాయర్ అబ్దుల్ సలీం సమక్షంలో దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, శ్రీనివాసరావుకు ఉద్యోగం కల్పించిన ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరిని ఈరోజు ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ఇందుకోసం హర్షవర్ధన్ చౌదరికీ ఇప్పటికే అధికారులు నోటీసులు జారీచేశారు.
మరోవైపు శ్రీనివాసరావుకు లేఖ రాసేందుకు సాయం చేసిన ఓ మహిళను కూడా అధికారులు నేడు విచారణ జరపనున్నారు. మరోవైపు జైలులో ఉండగా శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై కూడా ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించనున్నారు. అసలు ఆ లేఖలో ఏముంది? శ్రీనివాసరావు రాసిన లేఖను ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? వంటి అంశాలను విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసరావు కస్టడీ మరో రెండు రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే.