Rajanikanth: నా ఫీజులు రజనీ సారే కట్టేవారు.. ఇప్పుడు ఆయన రుణం తీర్చుకుంటున్నా: పోస్టర్ డిజైనర్ మధి

  • అమ్మ, తాతయ్య రజనీ ఇంట్లో పని చేసేవారు
  • ప్రతి దీపావళికి కుటుంబం మొత్తం వెళ్లేవాళ్లం
  • స్వీట్స్, బట్టలు ఇచ్చేవారు
  • కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సాయం చేశారు

ఒక స్థాయికి వెళ్లాక కొందరు తమ కింద పనిచేసిన వారిని మరచిపోతారు. కానీ రజనీకాంత్ మాత్రం అలా చేయలేదు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ఆయన నుంచి సాయం పొందిన మధి అనే యువకుడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం తాను పోస్టర్, బ్యానర్ డిజైనర్‌గా పని చేస్తున్నట్టు మధి తెలిపాడు. తమది పేద కుటుంబమని.. తన తల్లి, తాతయ్య రజనీ సార్ ఇంట్లో పని చేసేవారని మధి తెలిపాడు. దీంతో తన ఫీజులను రజనీయే కట్టేవారని పేర్కొన్నాడు. ప్రతి ఏడాది దీపావళికి తన కుటుంబం మొత్తం రజనీ ఇంటికి వెళ్లేవాళ్లమని.. తమకు ఆయన స్వీట్స్, బట్టలు ఇచ్చేవారని తెలిపాడు.

ఒకానొక ప్రత్యేక సందర్భంలో రజనీ ఇంటి ముందు జనం గుంపులుగా చేరారట. దీంతో తన తాతయ్యను, మరికొందర్ని అడయార్‌లోని ఇంటి వద్దకు రమ్మని రజనీ చెప్పారట. తామంతా అక్కడికి వెళ్లాక తెలుపు రంగు దుస్తుల్లో వచ్చిన రజనీ కాళ్లపై అక్కడి జనం పడటం మొదలు పెట్టారట. రజనీ మాత్రం అలా మరోసారి చెయ్యొద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారట.

అదే సమయంలో గుంపులో తమను గుర్తించి దగ్గరకు పిలిచి కాసేపు మాట్లాడి స్వీట్స్ ఇచ్చి పంపారని మధి తెలిపాడు. రజనీ భార్య లత కూడా తమనెంతో ఆప్యాయంగా చూసేవారని పేర్కొన్నాడు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు రజనీ తమ కుటుంబానికి చాలా సాయం చేశారని.. ఆయన వల్లే తాను ఉన్నత విద్యను అభ్యసించానని మధి తెలిపాడు. ఆయన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు డిజైన్ చేసి రజనీ రుణం కాస్త తీర్చుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

More Telugu News