Rajasthan: తప్పతాగి పురుడు పోసిన మేల్ నర్సులు.. రెండు ముక్కలైన శిశువు.. తల్లి గర్భంలోనే శిశువు తల!

  • జైసల్మేర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
  • శిశువు శరీరం నుంచి విడిపోయిన తల
  • బాధితురాలి పరిస్థితి విషమం

రాజస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తప్పతాగిన ఇద్దరు మగ నర్సులు పురుడు పోసేందుకు ప్రయత్నించారు. శిశువును బలవంతంగా బయటకు లాగేందుకు ప్రయత్నించడంతో శిశువు రెండు భాగాలుగా విడిపోయింది. తల తల్లి గర్భంలోనే ఉండిపోగా, బయటకు వచ్చిన శరీర భాగం నుంచి కాలేయం వేరుపడింది. అత్యంత హృదయ విదారకమైన ఈఘటన జైసల్మేర్ రాంగఢ్ ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.

ఈ నెల ఆరో తేదీన దీక్షా కన్వర్ అనే గర్భిణిని పురుడు కోసం రాంగఢ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతో అమృత్‌లాల్, జుంజిహార్ సింగ్ అనే మేల్ నర్సులు గర్భిణి విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుడు పోసే క్రమంలో బిడ్డను బలవంతంగా బయటకు లాగడంతో శిశువు తల శరీరం నుంచి విడిపోయి తల్లి గర్భంలోనే ఉండిపోయింది.

బయటకొచ్చిన శరీరం నుంచి కాలేయం వేరు పడి ఛిద్రమైంది. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టిన సదరు నర్సులు బిడ్డ చనిపోయిందని బాధితురాలిని నమ్మించారు. కాన్పు పూర్తయిందని, మాయ మాత్రం లోపల ఉండిపోయిందని అబద్ధం చెప్పారు. అయితే, శిశువు తల తల్లి గర్భంలోనే ఉండడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం దీక్షను జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించాలంటూ ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి చేతులు దులిపేసుకున్నారు.

జోధ్‌పూర్ ఆసుపత్రిలో బాధితురాలికి ఆపరేషన్ చేయగా శిశువు తలభాగం బయటపడడంతో జరిగిన ఘోరం వెలుగు చూసింది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తన మూడు దశాబ్దాల కెరియర్‌లో ఇటువంటి ఘటనను చూడలేదని దీక్షకు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు ఉష పేర్కొన్నారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు, ఈ ఘటనను వైద్యాధికారులు తీవ్రంగా పరిగణించారు. గర్భణికి పురుడు పోసిన మేల్ నర్సులు అమృత్‌లాల్‌, జుంజిహార్‌ సింగ్‌లను సస్పెండ్‌ చేశారు. ఆసుపత్రి ఇన్‌చార్జి నిఖిల్ శర్మను బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు, రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.

More Telugu News