ISRO: ఏప్రిల్ రెండో వారంలో చంద్రయాన్-2 ప్రయోగం: ఇస్రో చైర్మన్ శివన్

  • ముందుగా అనుకున్నట్టుగా నిర్వహించడం లేదు
  • ఇంకా, పలు పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది
  • అందుకే, ఈ ప్రయోగం ఆలస్యమవుతోంది

చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం చేపట్టనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ముందుగా ప్రకటించినట్టుగా ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్య నిర్వహించడం లేదని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. బెంగళూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంకా, పలు పరీక్షలు పూర్తి చేయాల్సి ఉన్నందున దీని ప్రయోగం ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఏప్రిల్ రెండో వారంలో చంద్రయాన్-2 ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ ప్రయోగానికి మొత్తం రూ. 800 కోట్ల వ్యయం కానుందని అన్నారు. పదేళ్ల క్రితం నిర్వహించిన చంద్రయాన్-1 కంటే అత్యుత్తమ ప్రమాణాలతో చంద్రయాన్-2ను ప్రయోగిస్తామని వివరించారు. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ సొంతంగా చేపట్టనున్న గగన్ యాన్ ప్రాజెక్టులో మహిళా వ్యోమగాములకు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్టు శివన్ తెలిపారు.

చంద్రుడి మీదకు, రోదసీలోకి మానవ సహిత అంతరిక్ష యాత్రను 2021 లోపు, మానవ రహిత అంతరిక్ష యాత్రను 2020లోపు పూర్తి చేస్తామని వెల్లడించారు. గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా వెళ్లే వ్యోమగాములకు శిక్షణను భారత్ లో, ఆధునిక శిక్షణను రష్యాలో ఇప్పించనున్నట్టు తెలిపారు. దేశంలోని ఆరు చోట్ల ఇస్రో పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయబోతోందని, ఇవి దేశం మొత్తం విస్తరించేలా ఉంటాయని చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో అంకుర పరిశ్రమలతో కలిసి పని చేసేలా ఈ ఆరు కేంద్రాలు ఉంటాయని వివరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News