Andhra Pradesh: ఏపీలో అతిపెద్ద ‘అవినీతి చక్రవర్తి’ జగనే: అచ్చెన్నాయుడు
- ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో చంద్రబాబుపై పుస్తకమా!
- ఇది సిగ్గు చేటైన పని
- జగన్ పాదయాత్రకు విలువ లేదు
‘అవినీతి చక్రవర్తి’ పేరుతో చంద్రబాబుపై వైసీపీ నేతలు పుసక్తం విడుదల చేయడం సిగ్గుచేటని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో అతిపెద్ద ‘అవినీతి చక్రవర్తి’ జగనేనని ఆరోపించారు. పాదయాత్రకు పవిత్రత ఉండాలని, జగన్ పాదయాత్రకు విలువ లేదని, రోజుకు 8 గంటలు వారానికి 4 రోజులు నడవడం కూడా పాదయాత్రేనా? అని ప్రశ్నించారు.
ఏడాది కాలం పాటు పాదయాత్ర చేసిన జగన్, కనీసం ఒక్కచోటైనా టెంట్ వేసి సభ పెట్టారా? బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చాక ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని, సంక్షేమం, అభివృద్ధితోనే ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి వెళ్తామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.