: విశ్వం పుట్టుకను వివరిస్తోన్న డార్విన్ సిద్ధాంతం...!
జీవ ప్రపంచంలో పరిణామక్రమాన్ని ఛార్లెస్ డార్విన్ వివరించారు. అయితే ఈ సిద్ధాంతాన్ని వివరించడంలో ఆయన రూపొందించిన అంచనాలనే విశ్వం పుట్టక అనేది కేవలం కృష్ణబిలాలను ఏర్పరచడానికే అనే విషయానికి కూడా అన్వయించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షి అనేది గాలిలో ఎగిరేందుకు అనువుగా తయారయ్యింది, చేప అనేది నీటిలో ఈదడానికి అనువుగా తయారయ్యింది అలాగే విశ్వం అనేది కృష్ణబిలాలను ఉత్పత్తి చేయడానికే ఆవిర్భవించిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
కాస్మొలాజికల్ పరిణామ సిద్ధాంతాన్ని వివరించడానికి, కృష్ణబిలాల తయారీకే విశ్వం రూపొందింది అనడానికి ప్రైస్ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. పరిణామక్రమ జన్యుశాస్త్రం నుండి దీనిని స్వీకరించారు. ప్రైస్ సిద్ధాంతం జన్యువులు, జీవుల స్థాయిలోనే కాకుండా విశ్వం స్థాయిలో కూడా పరిణామ క్రమాన్ని వివరిస్తోందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆండీ గార్డ్నర్ తెలిపారు. తాము రూపొందించిన నమూనాలో చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఇమిడివున్న గణిత సూత్రాలను పోలిన లెక్కలు ఇమిడివున్నాయని అంటున్నారు.