Madhya Pradesh: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చింది!: దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు

  • మా నేత బాజీనాథ్ కుష్వాహాను ప్రలోభపెట్టారు
  • ఇద్దరు బీజేపీ మాజీ మంత్రులు ఇందులో పాల్గొన్నారు
  • దిగ్విజయ్ ఆరోపణలను ఖండించిన కమలనాథులు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ తమ పార్టీ నేతను ప్రలోభపెట్టిందని విమర్శించారు. సబల్‌ఘర్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత బాజీనాథ్‌ కుష్వాహాను బీజేపీకి చెందిన నారాయణ్ త్రిపాఠి ఇటీవల కలుసుకున్నారని దిగ్విజయ్ తెలిపారు.

ఈ సందర్భంగా వీరిద్దరూ ఓ దాబా హోటల్ కు వెళ్లారన్నారు. అక్కడ  బీజేపీ నేతలు, మాజీ మంత్రులైన నరోత్తమ్‌ మిశ్రా, విశ్వాస్‌ సారంగ్‌ బాజీనాథ్‌తో కుష్వాహాతో భేటీ అయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాయం చేయాలని వారంతా కుష్వాహాను కోరారని దిగ్విజయ్ ఆరోపించారు.

ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు ఇస్తామనీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక మంత్రి పదవి సైతం కట్టబెడతామని ఆఫర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ఆఫర్ ను కాంగ్రెస్ నేత కుష్వాహా తిరస్కరించారని దిగ్విజయ్ అన్నారు. కాగా, ఈ ఆరోపణలను మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ఖండించారు. ఇలా అబద్ధాలను ప్రచారం చేస్తారు కాబట్టే దిగ్విజయ్ ను గాసిప్ మాంగర్ అని అంటారని విమర్శించారు.

ఈ విషయంలో ఆధారాలు ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో 15 సంవత్సరాల బీజేపీ పాలనకు మధ్యప్రదేశ్ లో తెరపడింది.

More Telugu News