: డయేరియా మరణాలు భారత్‌లోనే ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా అయిదేళ్లలోపు మరణించే పిల్లల్లో ప్రతి పది మరణాల్లోనూ ఒకరి చావుకు డయేరియా వ్యాధి కారణంగా ఉంటోందన్నది సత్యం. అలాంటిది ఇతర ప్రదేశాలతో పోల్చిచూసినప్పుడు.. భారత్‌లోనే డయేరియా కారణంగా ఎక్కువ శాతం మరణాలు నమోదవుతున్నట్లు ఓ అధ్యయనం ప్రమాదఘంటికలను మోగిస్తోంది. ఈ వివరాలను వెల్లడించే గ్లోబల్ ఎంటరిక్ మల్టిసెంటర్ స్టడీని 'లాన్సెట్' తాజా సంచికలో ప్రచురించారు. సబ్ సహారన్ ఆఫ్రికా, భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో... పసివాళ్లలో మరణానికి దారితీస్తున్న డయేరియా గురించి అధ్యయనం నిర్వహించినప్పుడు చాలా కేసుల్లో రోటావైరస్ అనేది ప్రధాన కారణం అని తేల్చారు.
డయేరియా మరణాల్లో భారత్ అగ్రభాగంలో ఉండగా, ఆసియాలోని బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్రికాలోని కెన్యా, మాలి, మొజాంబిక్, గాంబియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతి ఏటా రెండు నుంచి నాలుగుసార్లు ఇంటింటికీ తిరిగి దీనికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. కోల్‌కతలోని కలరా మరియు ఎంటెరిక్ వ్యాధుల జాతీయ సంస్థలోని ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ దీపికా సుర్ మాట్లాడుతూ పసికందుల్లో డయేరియా మరణాలు, తర్వాతి స్థానం కంటె రెట్టింపు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.