Telugudesam: విజయనగరం జిల్లాను రెండు కుటుంబాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి: పవన్ కల్యాణ్
- అనంతపురం జిల్లాలో కరవు వల్ల వలస పోతున్నారు
- కళకళలాడే విజయనగరం నుంచి ఎందుకు వలసలు?
- జిల్లాలోని ఆధిపత్య రాజకీయాలే ఈ పరిస్థితికి కారణం
ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విజయనగరం జిల్లా వెనుకబాటుతనానికి స్థానిక నాయకులే కారణమని, కేవలం, రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు ఈ జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విజయనగరం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నిక్లలో విజయనగరంలో అశోక్ గజపతిరాజు తరపున తాను ప్రచారం చేస్తే, ఆయన గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
అందుకే, విజయనగరంలో సభ ఏర్పాటు చేసిన సందర్భంలో తనను తాను పరిచయం చేసుకున్నానని అన్నారు. అనంతపురం జిల్లాలో వర్షాలు లేక, పంటలు పండక కరవు వల్ల అక్కడి ప్రజలు వలస పోతున్నారని, మరి, పంటలతో కళకళలాడే విజయనగరం జిల్లా నుంచి ఎందుకు వలస పోతున్నారని ప్రశ్నించారు. జిల్లాలోని ఆధిపత్య రాజకీయాలే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం టీడీపీ, వైసీపీలకు లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.