gst: జీఎస్టీ కమిషనర్ కు లీగల్ నోటీస్ పంపిన హీరో మహేశ్ బాబు

  • చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడిని నేను
  • నా ట్యాక్స్ లన్నీ సక్రమంగా చెల్లించా 
  • బ్యాంక్ అకౌంట్లను ఎలా నిలిపివేస్తారు?

జీఎస్టీ పన్ను బకాయిలు చెల్లించలేదంటూ ప్రముఖ హీరో మహేశ్ బాబుకు జీఎస్టీ కమిషనరేట్, హైదరాబాద్ నిన్న నోటీస్ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు లీగల్ టీమ్ స్పందించింది. చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడు మహేశ్ బాబు అని, తన ట్యాక్స్ లన్నీ సక్రమంగా చెల్లించారని తెలియజేస్తూ జీఎస్టీ కమిషనర్ కు లీగల్ నోటీస్ పంపారు. బ్యాంక్ అకౌంట్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిలిపివేయడం సరికాదని ఆ నోటీసులో పేర్కొన్నారు.

జీఎస్టీ కమిషనరేట్, హైదరాబాద్.. కోర్టు పరిధిలోఉన్న రూ.18.5 లక్షల పన్నుని వడ్డీతో సహా రూ.73.5 లక్షలుగా నిర్ణయించి బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించారని, 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్ కు ఈ పన్ను చెల్లించాలని నిర్ణయించారని, అయితే, ఇది ఎటువంటి  పన్ను పరిధిలోకి రాదని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. అంబాసిడర్ సర్వీసెస్ ని పన్ను పరిధిలోకి సెక్షన్ 65 (105) ద్వారా 01-07-2010 నుంచి చేర్చిన విషయాన్ని ప్రస్తావించింది.

కాగా, 2007-08 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.18.5 లక్షల సేవా పన్నును చెల్లించాల్సి ఉందని, అప్పటి నుంచి ఇప్పటివరకూ పన్నులు, వడ్డీ, జరిమానా మొత్తం కలిపి రూ. 73.5 లక్షలు రికవరీ చేసేందుకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  

More Telugu News