pinnelli ramakrishna reddy: బకెట్ బాంబుల సూత్రధారి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డే: యరపతినేని

- పతనావస్థలో ఉన్న వ్యక్తులకు ఇలాంటి నీచ ఆలోచనలే వస్తాయి
- తమ కుటుంబం మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు
- రానున్న ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ జెండా ఎగురుతుంది
గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామంలో కారు కింద అమర్చిన బకెట్ బాంబుల సూత్రధారి వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డేనని గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. పతనావస్థలో ఉన్న వ్యక్తులకు ఇలాంటి నీచమైన ఆలోచనలే పుడతాయని అన్నారు. హింస, దౌర్జన్యం, కుటిల రాజకీయాలు తమ కుటుంబానికి ఎన్నడూ లేవని చెప్పారు. యరపతినేని నరసింహారావు తమ కుటుంబీకుడేనని... తమ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకే పిన్నెల్లి బాంబులు అమర్చారని మండిపడ్డారు. మంచికల్లులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యరపతినేని ఈ వ్యాఖ్యలు చేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని యరపతినేని చెప్పారు. త్వరలోనే జగన్ సీఎం, తాను మంత్రి అని పిన్నెల్లి చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు సోదరుడు యరపతినేని మట్టయ్య మాట్లాడుతూ, తామంతా ఒక తల్లి పిల్లలమని... తమ కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బకెట్ బాంబుల అసలు విషయం తేల్చే బాధ్యత పోలీసులదేనని చెప్పారు.