: గవర్నర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు: చంద్రబాబు


రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్ ను కోరారు. మంత్రుల్లో పలువురు అవినీతి బురదలో కూరుకుపోయారని బాబు ఫిర్యాదు చేశారు. తాము చెప్పింది విని గవర్నర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారని బాబు తెలిపారు. ఈ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు.

అవినీతికి పాల్పడ్డారంటూ ఆరుగురు మంత్రులపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేస్తే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సీఎం వారికి న్యాయసహాయం అందించడాన్ని బాబు తప్పుబట్టారు. ఎ4 నిందితుడైన మంత్రి ధర్మాన రాజీనామా చేసినా, ముఖ్యమంత్రి ఆమోదించలేదని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చినా ఇంకా పదవిలో కొనసాగుతున్నారని, తద్వారా, సీఎం అవినీతి మంత్రులను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ అవినీతి గురించి తెలిసినా కేంద్రం స్పందించడలేదని బాబు విమర్శించారు. అవినీతి తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైనదని వ్యాఖ్యానిస్తూ, కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. బాబు వెంట గవర్నర్ ను కలిసిన వారిలో పార్టీ ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

  • Loading...

More Telugu News