: కనక్సీ ఖిమ్ జీ.. ప్రపంచంలో ఏకైక హిందూ 'షేక్'
అరబ్బు సంపన్నులకు వారి పేర్ల ముందర ఉండే రెండక్షరాల పదం.. 'షేక్'. వారికి జన్మతః ఈ షేక్ నామధేయం సంప్రాప్తిస్తుంది. కానీ, ఆశ్చర్యకరంగా ఓ హిందువుకు అతని పేరు ముందర 'షేక్' అన్న పదాన్ని చూస్తేనో, వింటేనో మనం కాస్త షేకవుతాం. వాస్తవంలో ఇలాగే జరిగింది. గల్ఫ్ దేశమైన ఒమన్ లో భారతీయ సంతతి వ్యాపారవేత్త కనక్సీ ఖిమ్ జీ సేవలకు మెచ్చి అక్కడి సుల్తాన్ ఖబూస్ బిన్ సెయిద్ ఈ షేక్ బిరుదును ప్రదానం చేశారు. దీంతో, పక్కా హిందువు అయిన ఖిమ్ జీ కాస్తా.. షేక్ కనక్సీ ఖిమ్ జీ అయ్యారు.
కనక్సీ ఖిమ్ జీ పూర్వీకులు 143 ఏళ్ళ క్రితమే గుజరాత్ నుంచి ఒమన్ కు వలస వెళ్ళారు. అక్కడ ధాన్యం, తేయాకు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేపట్టిన రామదాస్ అనే వ్యక్తి మునిమనవడే కనక్సీ ఖిమ్ జీ. ముత్తాత వ్యాపార వారసత్వాన్ని అంది పుచ్చుకున్న కనక్సీ ఒమన్ లో ఇప్పుడు టాప్ బిజినెస్ మేన్! రూ. 5 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రపంచంలోని 400 టాప్ బ్రాండ్లతో కనక్సీ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. అంతేగాకుండా, ఈ సంస్థకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనూ సభ్యత్వం ఉంది.
తన మూలాలు భారత్ లో ఉన్నప్పటికీ, ఒమన్ నే తన మాతృదేశంగా భావిస్తామని ఆయన తెలిపారు. అందుకే, ఆయన ఒమన్ లో 19 ఆంగ్ల పాఠశాలలు నెలకొల్పి 35 వేల మందికి విద్యాదానం చేస్తున్నారు. అంతేగాకుండా స్థానికుల్లో వృత్తినైపుణ్యం పెంపొందేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవలకు మెచ్చిన ఒమన్ సుల్తాన్.. కనక్సీకి షేక్ బిరుదును ప్రదానం చేశారు. అదండీ.. ప్రపంచంలో ఏకైక హిందూ షేక్ కథాకమామీషూ!