vijay mallya: మాల్యా మోసగాడు కానే కాదు.. క్షమించి మరో చాన్స్ ఇద్దాం: కేంద్రమంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

  • విజయ్ మాల్యాను మోసకారని ఎలా అంటారు?
  • మరో అవకాశం ఇచ్చి చూడాలి
  • మన బ్యాంకింగ్ వ్యవస్థలోనే లోపాలు

భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెనకేసుకొచ్చారు. మాల్యా, నీరవ్ మోదీ తదితరులను మోసగాళ్లు అనడం సరికాదన్నారు. వ్యాపారంలో రిస్క్ అనేది సర్వసాధారణమని, ఏదైనా కారణాల వల్ల అప్పు చెల్లించలేకపోయిన పక్షంలో క్షమించి వారికి మరో అవకాశం ఇచ్చి చూడాలని అన్నారు. గురువారం ‘టైమ్స్’ సంస్థ నిర్వహించిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మాల్యా నాలుగు దశాబ్దాలపాటు క్రమం తప్పకుండా రుణాలు చెల్లించారని, విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన నష్టాల పాలయ్యారని పేర్కొన్నారు.  దీంతో తీసుకున్న రుణాలు చెల్లించలేకపోయారని అన్నారు. అంతమాత్రాన ఆయనను ఎగవేతదారుగా ప్రకటించడం భావ్యం కాదన్నారు. మాల్యా అయినా, నీరవ్ మోదీ అయినా తప్పు చేస్తే జైలుకు పంపించాల్సిందేనని గడ్కరీ స్పష్టం చేశారు. అయితే, వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపై మోసగాళ్లగా ముద్ర వేయడం తగదన్నారు. అందరినీ దొంగలుగా సంబోధించడం మనకు అలవాటైపోయిందన్నారు.

నిజానికి మన బ్యాంకింగ్ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని గడ్కరీ విమర్శించారు. నిరర్థక ఆస్తుల కష్టాలకు బ్యాంకులే కారణమన్నారు. సాధారణంగా ఎవరైనా తీవ్ర అస్వస్థతకు గురైతే వెంటనే వారిని ఐసీయూలో చేర్పించి చికిత్స అందించి బతికించుకుంటామని, కానీ బ్యాంకులు మాత్రం ఖాయిలా పడిన కంపెనీలను ఐసీయూలో చేర్చి ఆ తర్వాత వాటిని చంపేస్తున్నాయని ఆరోపించారు. ఇలాగైతే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లడం కష్టమని గడ్కరీ అన్నారు.

More Telugu News