kcr: కేసీఆర్ గాలి 7వ తేదీన పెను తుపానుగా మారబోతోంది: కడియం శ్రీహరి

  • టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోంది
  • కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు కూడా గెలిచే పరిస్థితి లేదు
  • కేసీఆర్ ను ఎదుర్కొనే నేత మహాకూటమిలో లేరు

తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గాలి వీస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈ గాలి 7వ తేదీన (పోలింగ్ జరిగే రోజు) పెను తుపానుగా మారనుందని చెప్పారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని... కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. జిల్లాలోని ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు నీటిని అందించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. హన్మకొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహాకూటమి తెలంగాణ వ్యతిరేకుల కూటమి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని... ఆ పార్టీలో ఉన్న సీఎం అభ్యర్థులు కూడా ఓటమిపాలవుతారని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే నేత మహాకూటమిలో లేరని కడియం అన్నారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు. కోదండరామ్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేదని అన్నారు.

More Telugu News