Vijayababu: 'జనసేన' నుంచి విజయబాబు బయటకు రావడానికి కారణమిదేనా?

  • రెండు నెలల క్రితం జనసేనలో చేరిన విజయబాబు
  • స్వయంగా మాట్లాడే ఆస్కారం లేకపోయిందని మనస్తాపం
  • జనసేన నేతల వద్ద వాపోయిన విజయబాబు

జనసేనలో చేరి, అధికార ప్రతినిధి హోదాను పొందిన సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌, సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు విజయబాబు, ఆ పార్టీకి రాజీనామా చేయడం జనసేన వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తన వ్యక్తిగత కారణాల వల్లే జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు విజయబాబు ప్రకటించినా, ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక పార్టీ అధినేతల వైఖరే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం జనసేనలో చేరిన విజయబాబును పవన్ కల్యాణ్, అధికార ప్రతినిధిగా నియమించారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.

అధికార ప్రతినిధిగా ఉన్నా స్వయంగా మాట్లాడేందుకు ఆస్కారం లేకుండా పోయిందని, పార్టీలో ప్రజాస్వామ్య విలువలు లేవని గత కొన్ని రోజులుగా ఆయన మనస్తాపంతో ఉన్నారని జనసేన వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలో స్వాతంత్ర్యం లేదని, అధినేత నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే మాట్లాడాల్సి రావడం ఆయన్ను మధనపడేలా చేసిందని సమాచారం. ఈ కారణంతోనే ఆయన జనసేనకు రాజీనామా చేశారని తెలుస్తుండగా, ఆయన ఆకస్మిక నిష్క్రమణపై జనసేనలో పెద్ద చర్చే సాగుతోంది.

More Telugu News