muralomohan: నన్ను హీరోగా తీసుకున్నాక గిరిబాబును విలన్ ను చేశారు: మురళీ మోహన్
- 'జగమే మాయ' నా ఫస్టు సినిమా
- ముందుగా గిరిబాబును హీరో అనుకున్నారు
- మేమిద్దరం మంచి స్నేహితులం
కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి హీరోలు తమదైన స్టైల్లో దూసుకుపోతోన్న రోజుల్లో, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మురళీ మోహన్ సంపాదించుకున్నారు. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గాను కొనసాగారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు.
"మొదటి నుంచి కూడా నేను నాటకాలు బాగా వేసేవాడిని .. ఆ నాటకాలు చూసిన వాళ్లు సినిమాల్లో ట్రై చేయవచ్చు గదా అనేవారు. ఆ సమయంలోనే నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు 'జగమేమాయ' అనే సినిమాను కొత్తవాళ్లతో తీసే ప్రయత్నాల్లో వున్నారు. ఆ సినిమా కోసం హీరోగా గిరిబాబును తీసుకున్నారు. విలన్ పాత్ర వేసే వాళ్ల కోసం వెతుకుతుండగా పూర్ణచంద్రరావు గారు నా ఫోటోలు చూశారు. ఆ ఫోటోలు చూశాక గిరిబాబునే విలన్ గా పెట్టి .. నన్ను హీరోగా తీసుకోమని చెప్పారట. అలా నా కెరియర్ మొదలైంది. హీరో వేషం పోయినా గిరిబాబు ఏమీ ఫీల్ కాలేదు .. ఇప్పటికీ మేము మంచి స్నేహితులమే" అని చెప్పుకొచ్చారు.