: ఈతతో ఆస్థమాకు చెక్!
ఈత కొట్టడం ద్వారా ఆస్థమాను నియంత్రించవచ్చని టాస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 18 ఏళ్లలోపు ఆస్థమా బాధితుల్లో ఈత కొట్టడం ద్వారా జరిగే పరిణామాలను పరిశీలించామని, వీరిలో ఈత ద్వారా ఆస్థమా స్థిరంగా ఉందనే విషయాన్ని గుర్తించినట్టు వారు చెబుతున్నారు. ఈత కొట్టడం ద్వారా శరీరంలోని అనవసరమైన కొవ్వు కరిగిపోవడమే కాకుండా చక్కటి తీరైన ఆకృతి వస్తుందనేది మాత్రమే మనకు తెలుసు. అయితే ఈత వల్ల ఇలాంటి ప్రయోజనాలు కూడా ఒనగూరుతాయట...!
చిన్న వారిలో ఈత వల్ల ఆస్థమా స్థిరంగా ఉండడమే కాకుండా గుండె, ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా ఇటు శారీరక పరమైన సామర్ధ్యం కూడా పెరుగుతున్నట్టు తమ పరిశోధనలో గుర్తించినట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ సియాన్ బెగ్స్ అంటున్నారు. ఈత వల్ల ఆస్థమా నియంత్రణకు ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా చక్కటి ప్రయోజనం కలుగుతున్నట్టు బెగ్స్ అంటున్నారు. కాబట్టి చిన్న వయసులోని ఆస్థమా బాధితులు ఈత ద్వారా చక్కగా దాన్ని అదుపులో ఉంచవచ్చన్నమాట...!