Kerala: నా ఉద్యోగాన్ని డస్ట్ బిన్ లో పడేస్తున్నా: కేరళ మంత్రి భార్య నవప్రభ

  • కేరళ వర్శిటీలో నవప్రభకు డైరెక్టర్ గా పోస్టు
  • భర్త సిఫార్సుతో ఇచ్చారని విమర్శలు
  • రాజీనామా చేస్తున్నానన్న నవప్రభ

కేరళ మంత్రి జీ సుధాకరన్ సిఫార్సు కారణంగానే ఆయన భార్య జూబిలీ నవప్రభకు ఉద్యోగం వచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతుండటంతో, ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆమెకు కేరళ యూనివర్శిటీలో ఉద్యోగం రాగా, భర్త సాయంతో మరో మహిళకు రావాల్సిన పోస్టును కొల్లగొట్టారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె స్పందిస్తూ, తన భర్త కారణంగా ఉద్యోగం వచ్చిందని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అయినా తాను ఆ ఉద్యోగాన్ని డస్ట్ బిన్ లో పడేయాలని నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు.

"నేను అలపుళలోని ఎస్డీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేశాను. కేరళ యూనివర్శిటీ ప్రకటన ఇస్తే దరఖాస్తు చేసి ఎంపికయ్యాను. నా భర్త చాలా మంచి వ్యక్తి. ఆయనకు క్లీన్ ట్రాక్ ఉంది. మేమిద్దరమూ 36 ఏళ్లుగా కలిసున్నాం. ఇప్పుడు వస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందాను. ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను" అని నవప్రభ వ్యాఖ్యానించారు. ఆమె వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ పదవీ విరమణ చేయగానే, కేరళ యూనివర్శిటీలో ఆమె డైరెక్టరేట్ ఆఫ్ మేనేజ్ మెంట్ టెక్నాలజీ అండ్ ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ విభాగాలకు డైరెక్టర్ గా నియమితులయ్యారు.

More Telugu News