tej pratap: విడాకులకు ఒప్పుకునేంత వరకు ఇంటికి రాను: లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్

  • మా ఇద్దరి మధ్య వివాదాలు సమసిపోవు
  • నా మాట ఎవరూ వినడం లేదు
  • నా తమ్ముడు బీహార్ సీఎం కావాలి

తన భార్యతో విడాకులు తీసుకోవాలన్న తన నిర్ణయానికి తన కుటుంబసభ్యులు మద్దతు పలికేంత వరకు ఇంటి ముఖం చూడనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ తేల్చి చెప్పారు. పాట్నా కేంద్రంగా పని చేసే ఓ న్యూస్ చానల్ తో ఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఈ మేరకు తన నిర్ణయాన్ని తెలిపారు. ఇదే సందర్భంగా తన సోదరుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన సోదరుడి జన్మదిన వేడుకలకు కూడా తాను హాజరు కావడం లేదని చెప్పారు.

తనకు, తన భార్యకు మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోవని తేజ్ ప్రతాప్ చెప్పారు. మా పెళ్లికి ముందే తాను ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పానని అన్నారు. అప్పుడు, ఇప్పుడు ఎవరూ తన మాట వినడం లేదని వాపోయారు. తన మాటను వారు వినకపోతే... తాను ఇంటికి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. తమ మధ్య విభేదాలు తలెత్తడానికి తమ దగ్గర బంధువులు కూడా కారణమని చెప్పారు.

తన సోదరుడు తేజశ్వి బీహార్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉన్నట్టు... తన తమ్ముడికి తాను ఉంటానని చెప్పారు. కాగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి డరోగ ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ తో మే 12న తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. ఆరు నెలలు గడవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.

More Telugu News