RBI: ఆర్‌బీఐ గవర్నర్‌పై సీఐసీ ఆగ్రహం.. షోకాజ్ నోటీసు జారీ

  • సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోని ఆర్‌బీఐ
  • ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పేర్లు బయటపెట్టని రిజర్వు బ్యాంకు
  • 16లోగా సమాధానం చెప్పాలంటూ నోటీసులు

రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రూ. 50 కోట్లు అంతకుమించి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి పేర్లను వెల్లడించాల్సిందేనని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించడాన్ని తప్పుబట్టింది.

రుణాలు ఎగవేతదారుల పేర్లు ఎందుకు వెల్లడించలేదో  ఈ నెల 16లోగా సమాధానం చెప్పాలంటూ సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఆర్‌బీఐ గవర్నర్‌నే ప్రధాన సమాచార అధికారిగా భావించాల్సి ఉంటుందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పేర్లను వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు గాను జరిమానా ఎందుకు విధించకూడదో 16లోగా చెప్పాలని ఆదేశించారు.

పారదర్శకత, నిజాయతీలపై ఉర్జిత్ చెబుతున్నదానికి, ఆచరణకు పొంతన లేకుండా పోయిందని సీఐసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొండి బకాయిలపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాసిన లేఖను కూడా బయటపెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐలను కోరింది.

More Telugu News