african nation malavi: మలావిలో గాంధీ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్‌.. పనులు నిలపాలని అక్కడి కోర్టు ఆదేశం!

  • రూ.కోటి వ్యయంతో స్టాచ్యూ ఏర్పాటు చేస్తున్న ఢిల్లీకి చెందిన సంస్థ
  • వద్దంటూ కోర్టును ఆశ్రయించిన ’గాంధీ మస్ట్‌ ఫాల్‌’ గ్రూప్‌ సభ్యులు
  • గాంధీతో తమకు లాభం ఏం లేదన్న పిటిషనర్లు

మన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటుకు నిరసన ఎదురయ్యింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తూర్పు ఆఫ్రికా దేశం మలావి వాణిజ్య రాజధాని కేంద్రం లిలాంగ్వేలో గాంధీ స్టాచ్యూ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నానికి బ్రేక్‌ పడింది. దాదాపు కోటి రూపాయల వ్యయంతో ఈ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన విగ్రహం పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

‘గాంధీ తన జీవితంలో ఎక్కువ కాలం జాత్యహంకారాన్ని ప్రదర్శించడానికే వెచ్చించారు. నల్ల జాతీయులమైన మాకు ఆయన వల్ల ఎటువంటి లాభం లేదు సరికదా 'బ్లాక్' భావన మాలో మరింత బలంగా నాటుకుపోయింది. అటువంటి వ్యక్తి విగ్రహం రాజధానిలో నిర్మించడం భావ్యం కాదు’ అంటూ అక్కడి ‘గాంధీ మస్ట్‌ ఫాల్‌’ గ్రూప్‌ సభ్యులు తమ పద్దెనిమిది అభ్యంతరాలతో కూడిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖపై 3 వేల మంది మలావియన్లు సంతకాలు చేశారు. లేఖను పరిశీలించిన కోర్టు ఈ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది.

గాంధీజీ తొలి ఉద్యమం దక్షిణాఫ్రికాలోనే మొదలైంది. సత్యం, అహింస అయుధాలుగా బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్ముడిని ఆఫ్రికా దేశాల్లోని కొన్నివర్గాల ప్రజలు మాత్రం జాత్యహంకారిగా భావిస్తుంటారు. తమ మధ్య విభేదాలు సృష్టించిన వ్యక్తిగా భావిస్తూ వ్యతిరేకిస్తుంటారు. 2016లో ఘనాలోని ఓ యూనివర్సిటీలో గాంధీ విగ్రహం ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడూ ఇలాంటి నిరసన సెగే తగిలింది. అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లు విగ్రహం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. తాజాగా మలావిలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

More Telugu News