Chandrababu: చారిత్రాత్మకం... 22 ఏళ్ల తరువాత ఓ కాంగ్రెస్ చీఫ్ తో చంద్రబాబు భేటీ!

  • 1996లో పీవీ నరసింహరావుతో చర్చించిన చంద్రబాబు
  • అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పీవీ 
  • తిరిగి ఇన్నేళ్ల తరువాత రాహుల్ తో భేటీ

తెలుగుదేశం పార్టీ చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రెండు దశాబ్దాల తరువాత పార్టీ అధినేత హోదాలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలసి చర్చలు జరపనున్నారు. 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరిపారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడితో ఎన్నడూ చర్చించలేదు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ, కాంగ్రెస్ ను ఎదిరిస్తూ, టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిన సంగతి తెలిసిందే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పటికే ఈ రెండు పార్టీలూ దగ్గరయ్యాయి. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలూ కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరిగి అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో ఏపీలో జరిగే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో కలసి సాగాలని చంద్రబాబు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో నేటి భేటీ కీలకం కానుంది.

More Telugu News