roja: రోజాకు వార్నింగ్ ఇచ్చిన శివాజీ!
- రోజా కంటే నీచమైన భాషలో మాట్లాడగలను
- నన్ను విమర్శిస్తే పరువు నష్టం నోటీసులు పంపిస్తా
- నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే... జీవీఎల్ ను కూడా కస్టడీలోకి తీసుకోవాలి
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రత్యేక హోదా సాధన సమితి నేత, సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. తనపై రోజా ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆమెపై పరువు నష్టం దావా కూడా వేయగలనని... కానీ, ఇప్పటికీ ఆమెను గౌరవిస్తున్నానని అన్నారు. తాను మాట్లాడాలనుకుంటే... రోజా కంటే నీచమైన భాషలో మాట్లాడగలనని చెప్పారు. తాను పల్నాడు ప్రాంతానికి చెందినవాడినని... బూతుల్లో పీహెచ్డీ ఏదైనా ఉంటే అది మా పల్నాడులోనే ఉంటుందని చెప్పారు.
'రోజమ్మా... దయచేసి నా జోలికి రావద్దు. నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే... కచ్చితంగా పరువు నష్టం నోటీసులు పంపిస్తా' అని హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.
రాష్ట్రంలో జరగబోతున్న భయంకర పరిణామాల గురించే తాను 'ఆపరేషన్ గరుడ'కు సంబంధించిన వీడియోను విడుదల చేశానని శివాజీ అన్నారు. అందులో తాను బీజేపీ, వైసీపీ, జనసేనల పేర్లను ఎక్కడా ఉచ్చరించలేదని చెప్పారు. తన వీడియోను చూసి ఈ పార్టీల నేతలంతా... ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
తనను విచారించి మొత్తం సమాచారాన్ని లాగాలని వైసీపీ, బీజేపీ నేతలు అంటున్నారని... 20 నిమిషాలకు పైనున్న తన వీడియోలో తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పానని... ఇంకా ఏమి కావాలని ప్రశ్నించారు. విచారణ సంస్థలన్నీ కేంద్రం పరిధలోనే ఉన్నాయని, తనపై విచారణ జరుపుకోవచ్చని అన్నారు. తనను అరెస్ట్ చేసినా అభ్యంతరం లేదని తెలిపారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే... మూడు నెలల్లోగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీజేపీ నేత జీవీఎల్ ను కూడా కస్టడీలోకి తీసుకోవాలని అన్నారు.