New Delhi: స్కూలుకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించిన టీచర్.. తల పగులగొట్టి పరారైన విద్యార్థి!

  • ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన
  • బ్యాగులో ఐరన్ రాడ్ పై తల్లిదండ్రులకు చెప్పిన టీచర్
  • అదే రాడ్డుతో టీచర్ తలపై మోదిన విద్యార్థి

ఒకప్పుడు టీచర్లు కొడితేనే చదువు వస్తుందని తల్లిదండ్రులు నమ్మేవారు. పిల్లలు కూడా తమ మంచి కోసమే టీచర్లు దండిస్తున్నారని భావించేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కొన్నిచోట్ల టీచర్లు చిన్నారులను విచక్షణారహితంగా కొడుతుంటే, మరికొన్ని చోట్ల పిల్లలు సైతం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు ఎందుకు సరిగ్గా రావడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ టీచర్ తల పగిలింది.

దక్షిణ ఢిల్లీలోని సాకేత్ లో ఉన్న వీర్ చందర్ గడ్వాలా రాజకీయ్ బాల్ విద్యాలయంలో శ్యామ్ సుందర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్కూలుకు రెగ్యులర్ గా రాని 8వ తరగతి విద్యార్థిని శ్యామ్ నిలదీశాడు. స్కూలుకు ఎందుకు రావడం లేదు? పుస్తకాలు తెచ్చావా? అని ప్రశ్నిస్తూ అతని బ్యాగు చెక్ చేశాడు. దీంతో లోపల ఐరన్ రాడ్ దొరికింది. ఈ విషయమై శ్యామ్ వెంటనే పిల్లాడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ ఘటనతో ఆగ్రహానికి లోనైన బాలుడు అదే ఐరన్ రాడ్ తో శ్యామ్ తలపై దాడి చేశాడు.

అనంతరం స్కూలు నుంచి పరారయ్యాడు. గాయపడ్డ టీచర్ శ్యామ్ ను పాఠశాల వర్గాలు స్థానిక ఆసుపత్రికి తరలించాయి. కాగా, ఉపాధ్యాయుడు శ్యామ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందనీ, ఆయన ప్రాణానికి ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు నిందితుడు మైనర్ కావడంతో ఢిల్లీ పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. వ్యసనాలకు బానిసై పిల్లాడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News