shivaparvathi: 'అరుంధతి' సినిమా షూటింగ్ సమయంలో పాము వచ్చింది : నటి శివపార్వతి
- అది కోడి రామకృష్ణగారి మూవీ
- రాత్రి వేళలో షూటింగు జరుగుతోంది
- నా కుర్చీ కిందనే పాము వుంది
శివపార్వతి అటు కథానాయకులకు .. ఇటు కథానాయికలకు తల్లి పాత్రల్లో మెప్పించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దాసరి నారాయణరావు .. కోడి రామకృష్ణ వంటి దర్శకులను, రామానాయుడు వంటి నిర్మాతలను ఆమె తలచుకున్నారు. ఒకసారి ఒక సినిమా షూటింగులో జరిగిన తమాషా సంఘటన గురించి ఆమె చెప్పుకొచ్చారు.
"నాకు మొదటి నుంచి కూడా పాములంటే చచ్చేంత భయం. అదృష్టం కొద్దీ ఏ సినిమాకి సంబంధించి కూడా పాములను పట్టుకోవలసిన అవసరం ఏర్పడలేదు. అవి 'అరుంధతి' సినిమా షూటింగు జరుగుతోన్న రోజులు. నానక్ రామ్ గూడా నాయుడుగారి స్టూడియోలో రాత్రి వేళలో షూటింగ్ జరుగుతోంది. షూటింగు స్పాట్ లో నేను కుర్చీలో కూర్చున్నాను. నా పాదాలను ఏదో తాకుతోంది .. నేను కాస్త కదిలి మళ్లీ మామూలుగా కూర్చుంటున్నాను. అలా కొంతసేపు జరిగాక ఒక పాము నా ముందుకు వచ్చి పడగ విప్పింది .. అంతే హడలిపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.