ipl: సన్ రైజర్స్ యాజమాన్యంపై ధావన్ గుస్సా.. జట్టు మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న గబ్బర్!

  • ధావన్ ను రిటైన్ చేసుకోని సన్ రైజర్స్ 
  • తక్కువ ఫీజు లభించడంపై అసంతృప్తి
  • ముంబై ఇండియన్స్ వైపు గబ్బర్ చూపు

భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ జట్టుకు షాక్ ఇవ్వనున్నాడా? త్వరలోనే ముంబై ఇండియన్స్ జట్టులోకి మారిపోనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సన్ రైజర్స్ యాజమాన్యం వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్న ధావన్ రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఆ జట్టుకు టాటా చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ధావన్ 2013 నుంచి సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన వేలంలో సన్ రైజర్స్ జట్టు భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ లను రిటైన్ చేసుకుంది. ధావన్ ను మాత్రం రైట్ టు మ్యాచ్ కింద తీసుకుంది. ఒకవేళ ధావన్ ను రిటైన్ చేసుకుని ఉంటే ప్రస్తుతం రూ.5.2 కోట్లకు బదులుగా, దాదాపుగా రూ.12 కోట్లు దక్కేవి. కాగా తన సహచర ఆటగాళ్లు కోహ్లి(17 కోట్లు), రోహిత్‌ శర్మ(15 కోట్లు), ధోని(15 కోట్లు)లతో పోలిస్తే తనకు తక్కువ మొత్తం దక్కడంపై ధావన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టుకు టాటా చెప్పి ముంబై ఇండియన్స్ జట్టులో చేరేందుకు ధావన్ ఆసక్తి చూపినట్లు సమాచారం. కాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యంతో ధావన్ చర్చలు జరుపుతున్నారనీ, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధావన్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే అవకాశముంది.

More Telugu News