modi: రాఫెల్ ఒప్పందం రక్షణ మంత్రికి తెలియదు.. నోట్ల రద్దు ఆర్థిక మంత్రికి తెలియదు.. దేశంలో ఏం జరుగుతోంది?: యశ్వంత్ సిన్హా

  • పేరుకే కేంద్ర మంత్రులు.. అన్ని శాఖలను మోదీనే నిర్వహిస్తున్నారు
  • జమ్ముకశ్మీర్ లో గవర్నర్ పాలన విధించబోతున్న సంగతి హోంమంత్రికి కూడా తెలియదు
  • దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాల్సిందే

మన దేశ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ రోజుల కంటే దారుణంగా మోదీ ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. దేశ ప్రజలంతా మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని... ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అందరూ మేల్కొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పారు. లక్నోలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.

కేంద్ర కేబినెట్లలో పేరుకు మాత్రమే మంత్రులు ఉన్నారని... అన్ని శాఖలను మోదీనే నిర్వహిస్తున్నారని యశ్వంత్ సిన్హా దుయ్యబట్టారు. వివిధ శాఖలకు మంత్రులను నియమించినప్పటికీ, వారికి అధికారాలు ఇవ్వలేదని చెప్పారు. రాఫెల్ ఒప్పందం ఎలా జరగబోతోందో రక్షణ మంత్రికి తెలియదని, నోట్ల రద్దు జరగబోతోందనే విషయం కేబినెట్ మీటింగ్ కు వచ్చేంత వరకు ఆర్థిక మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించేంత వరకు ఆ విషయం హోంమంత్రికి తెలియదని విమర్శించారు. మన కేంద్ర మంత్రుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పారు.

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని... ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించిన సదుపాయాలను మాత్రమే ఆమె చూస్తున్నారని సిన్హా అన్నారు. ఆమెను ట్విట్టర్ మంత్రి, వీసాల మంత్రిగానే ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తేనే దేశాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు. లేకపోతే దేశం తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

More Telugu News