: మనదేశంలో ఏటా 3లక్షల మంది శిశువుల మృత్యువాత
భారత్‌లో ప్రతి ఏడాది దాదాపు మూడు లక్షల మంది శిశువులు పుట్టిన రోజే మృత్యువాత పడుతున్నారు. పలు రకాల ఇన్‌ఫెక్షన్స్, ఇంకా నివారించదగిన ఇతర కారణాల కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల వెలువడిన ఒక నివేదిక చెబుతోంది. సేవ్ ద చిల్డ్రన్ ఛారిటీ వారి వరల్డ్స్ మదర్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అప్పుడే పుట్టిన శిశుమరణాలలో భారతదేశంలో 29 శాతం ఉన్నట్టుగా చెబుతోంది.
బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో అప్పుడే పుట్టిన శిశుమరణాలు ఉన్నట్టు ఈ నివేదిక చెబుతోంది. తల్లులకు సరైన పోషకాహారం అందకపోవడం కూడా ఈ మరణాలకు ఒక కారణంగా ఇందులో పేర్కొన్నారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఒక రోజుకు వెయ్యి మందికన్నా ఎక్కువ మంది అప్పుడే పుట్టిన పిల్లలు నివారించ దగిన కారణాల వల్ల మరణిస్తున్నారని సేవ్ ద చిల్డ్రన్ ఛారిటీ రీజనల్ డైరెక్టర్ మైక్ నావెల్ అంటున్నారు. ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, నెలలు సరిగ్గా నిండకముందే ప్రసవం కావడం వంటి పలు కారణాల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని నివేదిక చెబుతోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించేందుకు పలు పథకాలను ప్రవేశపెడుతున్నా వాటి ఫలాలు అర్హులకు అందడం లేదని, ఇంకా నైపుణ్యంలేని వైద్యుల వల్ల జరిగే కాన్పుల ద్వారా పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు సోకి మరణిస్తున్నారని నావెల్ అంటున్నారు.