Saina Nehwal: ప్రేమ, పెళ్లితోపాటు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించిన సైనా
- డిసెంబర్ 16న పెళ్లి
- గోపిచంద్ అకాడమీలో శిక్షణ
- 2007లోనే కశ్యప్‌తో స్నేహం
- తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకున్నారు
తన ప్రేమ విషయమై ఇంతకాలం నోరు మెదపని సైనా నెహ్వాల్ తొలిసారి పెదవి విప్పింది. పారుపల్లి కశ్యప్‌తో ఆమె ప్రేమలో ఉందని వార్తలు చాలా కాలంగా వార్తలు వినవస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైనా తమ ప్రేమ ఎప్పుడు చిగురించిందీ.. ఇంతకాలం ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయిందీ.. తదితర విషయాలతో పాటు పెళ్లి డేటును కూడా వెల్లడించింది. దీంతో పాటు ఎన్నో ఆసక్తికర విషయాలను సైనా తెలిపింది.
తాము ఈ ఏడాది డిసెంబర్ 16న పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సైనా ఆ రోజునే పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించింది. 'డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాము. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. అందుకే ఆ లోపే పెళ్లి తంతు పూర్తి చేద్దామని అనుకున్నాం' అని సైనా తెలిపింది.
‘‘మేము 2005 నుంచి గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాం. 2007లో మా మధ్య స్నేహం చిగురించింది. అప్పటి నుంచి చాలా టోర్నీల్లో కలసి ఆడాము.. శిక్షణ తీసుకున్నాం. అలా మెల్లగా మా మధ్య ప్రేమ మొదలైంది. టోర్నీల్లో ఎంత బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి మాకు అవకాశం దొరికేది.
ఇక మేము ఎంచుకున్న కేరీర్ల కారణంగానే ఇంతకాలం వివాహం చేసుకోలేదు. టోర్నీలు గెలవడమే ముఖ్యం కాబట్టి వేరే విషయాలపైకి దృష్టిని మరల్చలేదు. పెళ్లి తర్వాత నాపై బాధ్యత పెరుగుతుంది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దని అనుకున్నాం. ఇప్పుడు అందుకు సమయం వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా మా ప్రేమను అర్థం చేసుకున్నారు’’ అని సైనా తెలిపింది.