: అంగారకుడిపై నివాసం.. భారత్‌కు సాధ్యమే!
ఒకవైపు అంగారక గ్రహం మీదకు మానవ రహిత రాకెట్‌ను పంపే ప్రయోగాన్ని ఈ ఏడాదిలోనే కార్యరూపంలో పెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ప్రయోగాల్లో నిమగ్నమై ఉండగా... మరోవైపు అంతర్జాతీయ స్థాయి అంతరిక్ష నిపుణులు మాత్రం ముందు ముందు రోజుల్లో అంగారకుడిపై నివాసప్రాంతాలను ఏర్పాటుచేసే యత్నాల్లో ఉన్న ఇతర దేశాల సరసన కూడా భారత్ చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
భారత దేశపు అంతరిక్ష సామర్థ్యం గురించి.. ఈ కితాబు ఇస్తున్నది ఎవరో కాదు.. చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యక్తి బుజ్ ఆల్‌డ్రిన్. మార్స్ పై అన్వేషణ గురించి వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు చెప్పారు. అంగారక గ్రహం మీద నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చైనా, జపాన్, యూరోప్, రష్యాలు కూడా యత్నిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి ఆస్ట్రోనాట్‌లు పరిశోధనల నిమిత్తం అంగారక గ్రహం మీదకు వెళ్లినప్పుడు ఆ నివాస ప్రాంతాల్లో ఉండి తర్వాత తిరిగి వచ్చేస్తుంటారని ఆయన అన్నారు.
అమెరికా నేతృత్వంలో 2034 నాటికి అంగారక గ్రహం మీదకు మానవుడి కాలుమోపేలా పరిశోధనలు పురోగమించాలని కూడా ఆల్‌డ్రిన్ అభిలషించారు.