maoist: కిడారి కుటుంబానికి భద్రత పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

  • పెరిగిన నేతలు, కార్యకర్తల రాకపోకలు
  • విచారణ కొనసాగిస్తున్న సిట్ బృందం
  • విశాఖ మన్యంలో కొనసాగుతున్న కూంబింగ్

మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబానికి పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతం కిడారితో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతోంది. దీనికితోడు పాడేరులో కిడారి కుటుంబాన్ని పరామర్శించేందుకు నాయకులు, కార్యకర్తలు రోజూ వస్తున్నారు. అంతేకాకుండా కిడారి పెద్దకొడుకు శ్రవణ్ కు మంత్రివర్గంలో చోటు లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి భద్రతను కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఇప్పుడున్న ఇద్దరు గార్డులకు అదనంగా మరో ఐదుగురు సాయుధ సిబ్బందిని కేటాయించారు. గత నెల 23న డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో కిడారి, సోమలను మావోయిస్టులు తుపాకితో కాల్చిచంపారు. ఈ ఆపరేషన్ లో దాదాపు 50 నుంచి 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే కొందరు దిగువస్థాయి నేతలు మావోలతో చేతులు కలిపి కిడారి, సోమలను ట్రాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై సిట్ విచారణ జరుపుతోంది. అలాగే ప్రస్తుతం మన్యంను భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి.

More Telugu News