Chandrababu: ‘తెలంగాణ’లో ముందస్తు కూడా టీడీపీని దెబ్బతీసేందుకేనన్న చంద్రబాబు!
- రాజకీయంగా కలిసి పని చేద్దామని కేసీఆర్ కు సంకేతాలిచ్చా
- మోదీ మాయలో పడి అందుకు అంగీకరించలేదు
- టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ, వైసీపీ, జనసేన కుట్రలు
రాజకీయంగా కలిసి పనిచేద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంకేతాలిచ్చానని, మోదీ మాయలో పడ్డ ఆయన అందుకు అంగీకరించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఏపీ మంత్రులు, ముఖ్య నేతలతో చంద్రబాబు ఈరోజు సమావేశమయ్యారు. తాజా రాజకీయాలు, మావోయిస్టుల కదలికలపై, ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
‘తెలంగాణ’లో ముందస్తు ఎన్నికలు కూడా టీడీపీని దెబ్బతీసేందుకేనని వారితో చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కలిసి టీడీపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని మంత్రులు, ముఖ్యనేతలకు బాబు చెప్పినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల గురించి ప్రస్తావిస్తూ, గతంలో తనపై దాడి చేసిన వారే, అరకులో జంట హత్యలకు పాల్పడ్డారని అన్నారు.
కాగా, ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కోరిందని ఓ మంత్రి ప్రస్తావించినట్టు సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని మరో మంత్రి, ఏపీ విషయంలోనూ ఐటీ దాడులు జరిగే అవకాశముందని ఇంకో మంత్రి అభిప్రాయపడ్డట్టు సమాచారం. జాతీయస్థాయిలో బీజేపీయేతర పక్షాలను ఒక్కతాటి మీదకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని చంద్రబాబు తమ నేతలతో ప్రస్తావించారని సమాచారం. చంద్రబాబు ప్రధాన మంత్రి అవుతారన్న వ్యాఖ్యలను ఎవరూ చేయొద్దని ఈ సమావేశంలో చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.