Karnataka: దలైలామా హత్యకు కర్ణాటకలో ఉగ్రవాదుల కుట్ర!

  • కుట్ర పన్నిన ఉగ్రవాది మునీర్
  • ఎన్ఐఏ అరెస్ట్ తో వెలుగులోకి
  • బైలుకుప్పె సమీపంలో హత్యకు కుట్ర

ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా హత్యకు కుట్ర చేసినట్టు కర్ణాటకలో ఇటీవల పట్టుబడిన ఓ ఉగ్రవాది వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రామనగర ప్రాంతంలో గత నెలలో సోదాలు జరిపిన ఎన్‌ఐఏ అధికారులు, జేఎంబీ టెర్రరిస్ట్‌ మునీర్‌ ను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌ కు చెందిన మునీర్, తమ దేశంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేశాడు. బంగ్లాదేశ్ లో పోలీసులు గాలిస్తుండడంతో ఇండియాలోకి చొరబడిన మునీర్, బట్టల వ్యాపారిగా అవతారం మార్చి కన్నడనాట ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని వ్యవహారాలపై నిఘా వేసిన ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి విచారించింది.

దలైలామా తరచుగా మైసూరుకు దగ్గరలో ఉన్న బైలుకుప్పె ప్రాంతంలోని టిబెటన్‌ పునరావాస కేంద్రానికి వస్తుంటారన్న సంగతిని పసిగట్టిన మునీర్, ఆయన వచ్చిన వేళ, హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ పని చేస్తే, భారత్‌ తో పాటు పలు దేశాల్లో చిచ్చు పెట్టవచ్చన్నది ఆయన వ్యూహం. ఈ సంవత్సరం జనవరి 18న బిహార్‌ లోని బుద్ధగయలో జరిగిన ఓ కార్యక్రమంలో బాంబు పేల్చడం ద్వారా దలైలామాను, ఆయనతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొనే బిహార్‌ గవర్నర్‌ ను హత్య చేయాలని కుట్ర చేసినట్టు కూడా మునీర్ చెప్పినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.

More Telugu News