New Delhi: శ్రుతి మించిన ఈవ్ టీజింగ్ .. బస్సులోంచి దూకేసిన యువతి!

  • దేశరాజధానిలో పట్టపగలు ఘటన
  • నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు
  • దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

బస్సులో తనను వేధించిన ఆకతాయిని ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొంది. ప్రయాణికుల సాయంతో అతడిని కొట్టి బుద్ధి చెప్పింది. అక్కడితో ఆగిపోని సదరు ఆకతాయి కొన్నిరోజుల తర్వాత మరికొందరిని వెంటబెట్టుకుని ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఈ వేధింపులు శ్రుతి మించడంతో ఆమె బస్సు నుంచి దూకేసింది. ఈ ఘటన సాక్షాత్తూ దేశరాజధాని అయిన ఢిల్లీలో చోటుచేసుకుంది.

దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో ఉంటున్న ఓ యువతి స్థానిక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఈ నేపథ్యంలో రోజూ బస్ నంబర్ 544లో ఆమె రాకపోకలు సాగిస్తోంది. ఈ మార్గంలో బస్సులో ఎక్కుతున్న ఆకతాయిలు అమ్మాయిలను తీవ్రంగా వేధిస్తున్నారు. కాగా, ఒకరోజు బాధితురాలిని వేధించడంతో ప్రయాణికుల సాయంతో ఆమె సదరు ప్రబుద్ధుడికి బుద్ధి చెప్పింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో మరో మార్గంలో యూనివర్సిటీ వెళ్లేది. అయితే ప్రయాణ సమయం ఎక్కువగా ఉండటంతో మళ్లీ పాత రూట్ లోనే వెళ్లడం ప్రారంభించింది.

ఈ క్రమంలో బాధితురాలిని గమనించిన ఆకతాయిలు ఆమె దగ్గరకు వచ్చి..‘నువ్వు ఎవరో మాకు తెలుసు, నీ ఇల్లు ఎక్కడుందో, నువ్వు ఏం చదువుతున్నావో అన్నది కూడా మాకు తెలుసు’ అని వేధించసాగారు. ఇలా మూడు నెలల కాలంలో ఏడు సార్లు ఆమెను వేధించారు. తాజాగా నిన్న మరోసారి వేధించడంతో వారి నుంచి తప్పించుకోవడానికి కదులుతున్న బస్సు నుంచి యువతి దూకేసింది.

ఈ విషయాన్ని బాధితురాలి సోదరి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై డీసీపీ విజయ్ కుమార్ స్పందిస్తూ.. బాధిత యువతి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకతాయిల ఆట కట్టించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామనీ, మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News