New Delhi: బుక్ చేసుకున్న క్యాబ్‌ను డ్రైవర్ రద్దు చేస్తే.. ఇక ఢిల్లీలో రూ.25 వేలు కట్టాల్సిందే!

  • క్యాబ్‌ అర్థాంతరంగా రద్దు చేస్తే డ్రైవర్‌కు రూ.25 వేల జరిమానా
  • ప్రయాణికుడి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసు కేసు
  • ముసాయిదా సిద్ధం చేసిన ఢిల్లీ రవాణా శాఖ

ప్రైవేటు క్యాబ్‌లు బుక్ చేసుకునే అలవాటున్న వారికి ఇది శుభవార్తే. అయితే, ఈ గుడ్ న్యూస్ ఢిల్లీ నగర వాసులకు మాత్రమే. క్యాబ్‌ను బుక్ చేసుకున్న తర్వాత కాసేపటికి ఆ ప్రాంతానికి రాలేమంటూ డ్రైవర్లు ఆ రైడ్‌ను రద్దు చేస్తే ఇకపై రూ. 25 వేలు ప్రయాణికుడికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.  ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ రోడ్డు రవాణా సంస్థ ఈ ప్రతిపాదనను రూపొందించింది.

ప్రయాణికుల పట్ల డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు కూడా నమోదు చేయాలని, ఒకవేళ కేసు పెట్టకుంటే డ్రైవర్ లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ ముసాయిదాను ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్ త్వరలోనే కేబినెట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అంతేకాదు, ఇకపై యాప్ ఆధారిత క్యాబ్ సేవలకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా తప్పనిసరి. అలాగే, కనిష్ఠ, గరిష్ఠ ధరలను రవాణా శాఖ నిర్ణయించేలా చట్టాన్ని కూడా తీసుకురానున్నారు.

More Telugu News