Araku valley: ఎమ్మెల్యే కిడారి హత్య ఎఫెక్ట్.. అరకు సీఐపై వేటు?

  • అరకు సీఐ వెంకునాయుడిపై సస్పెన్షన్ వేటు
  • నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం
  • మరికొందరు అధికారుల బదిలీ

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసు శాఖ స్పందించింది. నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. పోలీసుల వైఫల్యంపై ఇప్పటికే శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు అరకు సీఐ ఇ.వెంకునాయుడిని సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. నేడో, రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన గిరిజనులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడికి పాల్పడి నిప్పు పెట్టారు. పోలీసులను చితక్కొట్టారు. సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డుంబ్రిగూడ ఎస్సై అమ్మన్‌రావును సస్పెండ్ చేసిన అధికారులు నేడు వెంకునాయుడును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, మరికొందరు అధికారులను కూడా బదిలీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

More Telugu News