Telangana: తగ్గుతున్న ఎస్సీ కులాంతర వివాహాలు.. ‘ప్రోత్సాహకం’ పెంపుకు టీ-ప్రభుత్వం యోచన!
- నజరానా మొత్తాన్ని భారీగా పెంచే యోచన
- రూ.50వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదన
- ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ
రాష్ట్రంలో ఎస్సీ కులాంతర వివాహాలు గణనీయంగా తగ్గిపోతుండడంతో అదనపు ప్రోత్సాహకం అందించి ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటి వరకు ఇస్తున్న రూ.50 వేలకు అదనంగా మరో రూ.2 లక్షలు జోడించి కొత్త జంటకు మొత్తం రెండున్నర లక్షల రూపాయలు అందించాలని నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కరుణాకర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కులాంతర వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2015-16లో 1959 మంది దళితులు కులాంతర వివాహాలు చేసుకోగా, 2017-18 నాటికి ఈ సంఖ్య 1090కి పడిపోయింది.
సంఖ్య తగ్గడంతోపాటు ప్రోత్సాహకానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేక చాలామంది దరఖాస్తుకు ఆసక్తి చూపడం లేదు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు ఇస్తుండగా, కేంద్రం రూ.2.5 లక్షలు అందిస్తోంది. కానీ కేంద్ర ప్రోత్సాహకం అందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో ఆఫీసుల చుట్టూ తిరగలేని వారు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మొత్తం అందించి ఎస్సీ కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.