Chandrababu: జగన్‌పై విరుచుకుపడిన జేసీ.. ప్రతి దానికీ బాబుదే తప్పంటే ఎలా? అని నిలదీత
- ఎవరు తుమ్మినా చంద్రబాబుదే తప్పంటే ఎలా?
- ప్రబోధానంద ఫ్యాక్షనిస్టుల కంటే డేంజర్
- తన గన్‌మెన్లపైనా జేసీ విసుర్లు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనకు బాబే కారణమన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై జేసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరు తుమ్మినా బాబుదే తప్పంటే ఎలా? అని ప్రశ్నించారు. బుధవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడారు.
ప్రబోధానంద స్వామి ఆశ్రమానికి సంబంధించి తన ఉద్ద ఉన్న ఆధారాలను చంద్రబాబుకు అందించినట్టు చెప్పారు. చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు. అయినా, చంద్రబాబు ఏ విషయాన్ని తొందరగా తేల్చరని పేర్కొన్నారు. ప్రబోధానంద సీమ మనుషుల కంటే ప్రమాదకరమని, ఆయన భక్తులు మారణాయుధాలతో రెచ్చిపోయారని ఆరోపించారు. వారి దెబ్బకు పోలీసులే పరుగులు తీశారన్నారు.
తన అంగరక్షకులు కనీసం గాల్లోకి కాల్పులు జరిపినా ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. మూడు పూటలా తిండిపెట్టి, ఏసీ కార్లలో తిప్పడానికి వారిని గన్‌మెన్లుగా పెట్టుకోలేదన్నారు. హిందూ దేవతలను బూతులు తిడుతున్న ప్రబోధానంద స్వామి అసలు హిందువేనా? అని జేసీ ప్రశ్నించారు.