AP: ‘పెళ్లి ముచ్చట’కు గుర్తింపునిచ్చేది ఎవరు?.. అసెంబ్లీలో ఆసక్తికర చర్చ!

  • వధూవరులకు సంబంధం లేని ఊర్లో వివాహం అయితే సమస్య ఏర్పడుతోందన్న సభ్యులు
  • అటువంటి పెళ్లిని కార్యదర్శులు  ధ్రవీకరించడం లేదని ఆరోపణ 
  • బిల్లులో స్పష్టతనిస్తామని మంత్రి హామీ

అసెంబ్లీలో ‘ఆంధ్రప్రదేశ్‌ వివాహాల నిర్బంధ నమోదు సవరణ బిల్లు’ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం ఆసక్తికర చర్చసాగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన దంపతులకు ‘చంద్రన్న పెళ్లికానుక’ అందిస్తున్న నేపథ్యంలో వివాహ గుర్తింపు అంశంపై ఎదురవుతున్న ఇబ్బందులను పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు.

బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కార్యదర్శులు ధ్రువీకరణ పత్రం ఇస్తారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సభకు తెలిపారు. ఈ సందర్భంగా విప్‌ కూన రవికుమార్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి మాణిక్యాలరావులు 'గుర్తింపు'నకు ఎదురవుతున్న ఇబ్బందులను సభదృష్టికి తెచ్చారు.

 ‘అమ్మాయిది ఒక ఊరు, అబ్బాయిది మరో ఊరు, వీరిద్దరూ పెళ్లి చేసుకునేది ఇంకోఊరులో అయినప్పుడు ఆ వివాహాన్ని ధ్రువీకరించేందుకు కార్యదర్శి నిరాకరించిన అంశాన్ని కూన రవికుమార్‌ ప్రస్తావించారు. గుడి, మసీదు, చర్చిల్లో పెళ్లి చేసుకుంటే అక్కడి సిబ్బంది ధ్రువీకరిస్తున్నారని, ప్రైవేటు పెళ్లిళ్లకే ఇబ్బంది అవుతోందని బుచ్చయ్యచౌదరి అన్నారు. చర్చిలో జరిగే పెళ్లిళ్లకే కాక బయట జరిగిన వాటికి కూడా పాస్టర్లు గుర్తింపు పత్రం ఇస్తున్నారని, అర్చకులకు కూడా అటువంటి అధికారం ఇవ్వాలని మాణిక్యాలరావు సూచించారు.

తమ పరిధిలో జరిగే ఏ పెళ్లినైనా ధ్రువీకరించేలా కార్యదర్శులకు అధికారం ఇవ్వాలని త్రిమూర్తులు కోరారు. దీనిపై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ బిల్లు స్పష్టంగా ఉండాలని, బాధ్యులెవరో నిబంధనల్లో పొందుపరచాలని సూచించారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గుర్తింపు విషయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిబంధనల్లో స్పష్టతను ఇస్తామన్నారు. అనంతరం సభ బిల్లును ఆమోదించింది.

More Telugu News