Hyderabad: లుంబిని, గోకుల్‌చాట్ పేలుళ్ల నిందితులకు నేడు శిక్షలు ఖరారు!
- ఇద్దరిని దోషులుగా తేల్చిన నాంపల్లి సెషన్స్ జడ్జి
- మరో నిందితుడు తారీఖ్ అంజూమ్ ప్రమేయంపై తీర్పు
- కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
పదకొండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు నిందితులకు న్యాయస్థానం ఈరోజు శిక్షలు ఖరారు చేయనుంది. 2007 ఆగస్టు 25న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబిని పార్క్‌ల్లో ముష్కరమూకలు వరుస పేలుళ్లకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 44 మంది చనిపోయారు.
రాష్ట్ర పోలీసు శాఖ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం కేసు దర్యాప్తు చేసి అభియోగపత్రాలు నమోదు చేసింది. దశాబ్ద కాలానికి పైగా సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు బాంబులు పెట్టిన అనీక్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిల నేరాన్ని నిర్ధారించి గత మంగళవారం తుది తీర్పు వెలువరించింది. మరో ఇద్దరు నిందితులు షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్బుద్దీన్ తర్ఖాష్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. దోషులుగా తేల్చిన ఇద్దరికి నేడు శిక్షలు ఖరారు చేయనుంది. అదే సమయంలో మరో నిందితుడు మహ్మద్ తారిక్ అంజూమ్ ఎహసాన్‌పై తుది తీర్పు కూడా నేడు వెల్లడించనుంది.
ఇదిలా ఉంచితే, మరో ముగ్గురు నిందితులు రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రెజాఖాన్‌లు పరారీలో ఉన్నారు. కోర్టు శిక్షలు ఖరారు చేయనున్న నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.