Telugudesam: కాంగ్రెస్ తో పొత్తు దిశగా వేగం పెంచిన తెలంగాణ టీడీపీ!

  • ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశం
  • కనీసం 25 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలు కోరుతున్న టీడీపీ
  • గెలిచే అన్ని చోట్లా అభ్యర్థులను నిలుపుదామన్న చంద్రబాబు

తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభం కాగా, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు పెద్దిరెడ్డి, దేవేందర్ రెడ్డి, రావుల తదితరులు హాజరుకాగా, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వారికి ఎన్నికల వ్యూహంపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

కనీసం 25 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలను టీడీపీ ఆశిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం 15 సీట్లు, ఒకటి లేదా రెండు లోక్ సభ సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తోంది. దీంతో గెలిచే అవకాశం వున్న అన్ని చోట్లా అభ్యర్థులను నిలుపుదామని, ఈ మేరకు టికెట్లను తీసుకునేలా పట్టుబట్టాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి సైతం టీడీపీ అండ కావాలని గుర్తు చేసిన చంద్రబాబు, పొత్తుల విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో గట్టిగా నిలబడాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఇక ఇదే సమావేశంలో మేనిఫెస్టో, స్ట్రాటజీ, ప్రచార కమిటీలను సైతం చంద్రబాబు ప్రకటించనున్నారు. పక్క రాష్ట్రానికి సీఎంగా ఉన్న తాను, ప్రచారంలో పాలుపంచుకోలేనని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడి హోదాలో తనవంతు సహకారాన్ని మాత్రం అందిస్తానని తెలంగాణ టీడీపీ నేతలతో చెప్పడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేతలతో సీట్ల సర్దుబాటు అంశంపై తేలని పక్షంలో జాతీయ స్థాయిలో ప్రయత్నించి, రాహుల్ గాంధీతో మాట్లాడాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News